గడిచిన ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమికి 10 శాతం ఈవీఎంలు కారణమని, మిగిలిన 90 శాతం నాయకులు కారణమని, వారే మోసం చేశారని, అందుకనే ఎన్నికల్లో ఓడామని లోకేష్ అన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యాక రాజకీయ పండితులు, విశ్లేషకులే కాదు, ఇతర పార్టీల నాయకులు కూడా తలోరకంగా టీడీపీ ఓటమికి కారణాలను చెబుతున్నారు. అయితే ఎవరెన్ని కారణాలు చెప్పినా.. అవన్నీ దాదాపుగా ఒకే రకంగా ఉంటున్నాయి. కానీ తమ పార్టీ ఓటమికి అసలు కారణం ఏమిటన్నది నారా లోకేష్ చెప్పేశారు. అవును, ఇవాళ ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ టీడీపీ ఎందుకు ఓడిందో.. అసలు కారణాన్ని వెల్లడించారు.
ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నారా లోకేష్ ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమికి 10 శాతం ఈవీఎంలు కారణమని, మిగిలిన 90 శాతం నాయకులు కారణమని, వారే మోసం చేశారని, అందుకనే ఎన్నికల్లో ఓడామని లోకేష్ అన్నారు.
ఎన్నికల్లో గల్లా జయదేవ్ వంటి నాయకులే గెలవగా లేనిది, మిగిలిన నాయకులు ఎందుకు ఓడిపోయారని లోకేష్ అన్నారు. ఎన్‌టీఆర్ ఒక గొప్ప నాయకుడని, ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చారని కొనియాడారు. ఇక పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని, కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ విడిచిపెట్టబోనని హెచ్చరించారు. 2024లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగుర వేస్తామని లోకేష్ అన్నారు. ఓడిపోయిన చోట గెలవాలన్నదే తమ అభిమతమని, ఇకపై ఎమ్మెల్సీగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలకు, నాయకులు పిలుపునిచ్చారు. చంద్రబాబు సేనాధిపతి అయితే మనమంతా సైనికులమని నారా లోకేష్ అన్నారు. 2024లో చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎం అవుతారని అన్నారు.