ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం పెంచుతూనే ఉంది. అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలపై ఏదొక రూపంలో పన్నుల భారం పడుతూనే ఉంది. ఏ ప్రభుత్వమైన అభివృద్ధి ద్వారా ఆదాయం సృష్టిస్తుంది…కానీ జగన్ ప్రభుత్వం భారీ ధరలు, భారీగా పన్నులు పెంచడం ద్వారా ఆదాయం సృష్టిస్తుంది. ఇప్పటివరకు అదే పనిచేస్తూ వచ్చింది. ఇప్పటికే ఇసుక, మద్యం ధరల విషయంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ధరలు మండుతున్న విషయం తెలిసిందే. అటు కరెంట్, ఆర్టీసీ చార్జీల బాదుడు కొనసాగుతుంది. అలాగే ఇంటి పన్ను పెంపు…చెత్త మీద పన్ను, బాత్రూమ్పై పన్ను అంటూ ప్రజలపై పన్నుల భారం పెంచుకుంటూ వస్తున్నారు.
అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై కాస్త ప్రజలకు ఊరట ఇచ్చింది. జగన్ ప్రభుత్వం ఏ మాత్రం ఊరట ఇవ్వలేదు. పైగా ప్రజలకు కనబడని విధంగా పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ని శాతాల రూపంలో పెంచారు. దాని వల్ల పెట్రోల్, డీజిల్ మూల ధర పెరిగిన ప్రతి సారి వ్యాట్ కూడా పెరుగుతుంది. దీనికి తోడు రోడ్డు సెస్ పేరిట లీటరుకు రూపాయి పన్ను వసూలు చేస్తున్నారు. ఇలా ఒకటి ఏంటి అనేక రూపాల్లో ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది.
తాజాగా ప్రజలపై మరోభారం వేశారు. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను, పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్‌లలో పెంపుదల పెంచుతూ అసెంబ్లీలో బిల్లు సవరించారు. కొత్త వాహనాలకు 1 శాతం నుంచి 4 శాతం వరకు లైఫ్ ట్యాక్స్ పెంచగా, 4 వేల నుంచి 6 వేల వరకు గ్రీన్ ట్యాక్స్ విధించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై 409 కోట్ల అదనపు భారం పడనుందని తెలుస్తోంది. అంటే కొత్త వాహనాల ధరలు పెరగనున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో ఒక బైక్ ధర రూ. లక్ష ఉంటే…ఏపీలో దాదాపు లక్షా పది వేలు ఉంటుంది. అంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో వాహనాల ధరలు అధికంగా ఉండనున్నాయి. మరి ఎప్పటివరకు జగన్ ప్రభుత్వం బాదుడు కంటిన్యూ చేస్తుందో చూడాలి.