అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వం తెచ్చిన హైడ్రాపై గులాబీ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మూసీ ప్రాంత ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం చేస్తోందని విమర్శించారు. పునరావాసం కల్పించకుండా ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడి ఫాంహౌస్‌లను కూలుస్తామంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు తన తండ్రి పటోళ్ల ఇంద్రారెడ్డి 70వ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్‌లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే వారు తెలుసుకోవాలి. మీ బెదిరింపులకు, హేయమైన మాటలకు భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు.ధైర్యం పంచాలనే ఒక వ్యక్తిగా చెబుతున్నా..మీరెంత బెదిరిస్తే అంత ప్రజల తరపున కొట్లాడుతాం.దానికి రెండింతలు ప్రజల కోసం ప్రశ్నిస్తాము’ అని బదులిచ్చారు.