కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఐదు సార్లు విఫలం కావడంతో మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. అయితే రేపు జరగనున్న భారత్ బంద్ కు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక దేశ్యాప్తంగా వివిధ ప్రజాసంఘాలు, ప్రముఖులు సైతం మద్దతు తెలుపుతూనే ఉన్నారు. తాజాగా భారత్ బంద్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత చట్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆగ్రాలో మెట్రోరైల్ ప్రాజెక్ట్ వర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో రూ.వంద లక్షల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్స్‌ను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అంతేకాకుండా కొత్త చట్టాలు తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టడం దేశానికి చాలా అవసరమని చెప్పారు. ఎందుకంటే గత కాలంలో ఉపయోగపడిన చట్టాలు, అధికరణలు పస్తుత కాలానికి అనువైనవిగా ఉండకపోవచ్చన్నారు. ఇక పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
కేంద్ర సర్కార్ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేయడంతో.. భారత్ బంద్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాకుండా ప్రస్తుతం అవి ప్రజలకు భారంగా కూడా మారొచ్చని అన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చట్టాలను సవరించి ప్రజలకు అవసరమైన విధంగా రూపొందిస్తుందని తెలిపారు. అందుకే దేశ ప్రజలు మాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రకటించారు అందుకు నిదర్శనమే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను చూపించారు. అయితే ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో ప్రధాని నోటివెంట ఇటువంటి మాటలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతులకు తాము అనుకూలంగానే ఉన్నామని ప్రధాని మోదీ చెప్పకనే చెప్పినట్లు అర్ధమవుతోందిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.