టీటీడీ చైర్మన్ గా చాగంటి…? కూటమి నిర్ణయాన్ని ప్రవచనకర్త ఒప్పుకుంటారా…!

-

తిరుమల లడ్డు వివాదం దేశమంతా మారుమోగుతోంది. టీటీడీకి చైర్మన్ లేకపోవడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ నియామకంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని చైర్మన్ గా నియమించాలని ఆలోచన చేస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పేరు ప్రముఖంగా వినిపించింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు పేరు బయటకు వచ్చింది.మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, టిడిపి కురువృద్ధుడు అశోక్ గజపతి రాజుకు ఆ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటి ప్రకటన ఏమీ రాలేదు. సినీ నటుడు మురళీమోహన్, టీవీ5 అధినేత పి ఆర్ నాయుడు పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. కానీ ఎవరిని నియమించలేదు.

గత వారం 20 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ లను చంద్రబాబు ప్రకటించారు.కానీ అందులో టీటీడీ ప్రస్తావన లేదు. అయితే వరుసగా టీటీడీపై వస్తున్న వివాదాల నేపథ్యంలో.. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తాజాగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. ఆయన పేరు వినిపించగానే చాలామంది మద్దతు తెలిపారు. చాగంటి అయితే ధర్మప్రచారానికి ఢోకా ఉండదని చెప్తున్నారు.

వైసిపి హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుడుగా చాగంటి నియమితులయ్యారు. అప్పట్లో చాగంటి కుటుంబం తాడేపల్లి కి వెళ్లి మరి అప్పటి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కానీ నెల రోజులకే తన పదవికి రాజీనామా చేశారు చాగంటి. టీటీడీకి సేవలందించడానికి పదవులు ఉండక్కర్లేదని.. ఇతర మార్గాల్లో కూడా సేవలు అందించవచ్చు అని అప్పట్లో స్పష్టం చేశారాయన.

వైసిపి విధానాలు నచ్చక అప్పట్లో చాగంటి రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై స్పందించని చాగంటి … టీటీడీకి సేవలందించే అవకాశం వస్తే తప్పకుండా ఆలోచన చేస్తానని అప్పుడు ప్రకటించారు. అయితే ఇప్పుడు లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో టిటిడి చరిత్ర మసకబారుతోంది. అందుకే శ్రీవారి సేవను పారదర్శకంగా చేసుకునే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తికి అప్పగిస్తే న్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ పెద్దలు నేరుగా చాగంటి దగ్గరకు వెళ్లి ఒప్పించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఒక వేళ ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఆయన ఒప్పుకుంటే టీటీడీ బోర్డుకి మంచి రోజులు వచ్చినట్టే. ఆయన సారథ్యంలో తిరుమలలో ధర్మం నాలుగు స్తంభాలపై నిలబెడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి చాగంటి అంతరంగంలో ఏముందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version