హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గత రెండు దశాబ్దాలుగా ఏకచక్రాధిపత్యం చేస్తున్నారు. అక్కడ ఆయన ఏది చెప్తే అదేజరుగుతుంది. అంతలా ఆయన మార్కును చూపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆయన మార్కు లేకుండా చేయాలనేది కేసీఆర్ ప్లాన్. మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తున్న గులాబీ బాస్.. ఇప్పుడు కూడా ఉప ఎన్నికలో ఈటలకు బలం లేకుండా ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఈటలకు అనుకూలంగా ఉంటున్న వారిపై వేటు వేశారు. పెద్ద పొసీషన్లో ఉన్న డీసీపీలు, ఎమ్మార్వోలను సైతం పక్కన పెట్టేసింది సర్కారు. ఇక తాజాగా ఇప్పుడు అన్ని మండలాల్లో ఉన్న కానిస్టేబుళ్లపై ఫోకస్ పెట్టారు గులాబీ బాస్.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్బన్, రూరల్, జమ్మికుంట అర్బన్, రూరల్ తో పాటు మిగతా మండలాల్లో అందరూ ఈటల మద్దతు దారులే కానిస్టేబుళ్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 300మంది కానిస్టేబుళ్లు ఈటల వర్గీయులని కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో వారంతా ఈటలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నందున వారిపై వేటు పడునుంది. కానీ ఒక్క నియోజకవర్గంలోనే చేస్తే అనుమానం వస్తుందని కరీంనగర్ కమిషనరేట్ మొత్తం బదిలీలు చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి శ్రీకారం చుట్టనున్నారు గులాబీ బాస్.