దేశవ్యాప్తంగా జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న తెలంగాణలోని హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇక ఈ ఎన్నికకు ఈనెల 23న నోటిఫికేషన్ విడుదలకాగా, నామినేషన్ల దాఖలుకు ఈనెల 28 చివరి తేదీగా ప్రకటించారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలనకాగా, అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 24న ఫలితాలు విడుదల కానునట్టు సీఈసీ తెలిపారు. ఇక ఈ క్రమంలోనే హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖారారు చేసింది అధిష్టానం. శానంపూడి సైదిరెడ్డి పేరును సిఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు.
ఇక గత ఎన్నికలకు ముందు వరకు ఎన్నారైగా ఉన్న సైదిరెడ్డి ఆ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీద పోటీ చేసి చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి కేవలం 7 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఉత్తమ్ ఎంపీగా గెలిచి ఈ సీటుకు రాజీనామా చేయడంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో మళ్లీ సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని టీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ శనివారం మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు.
పద్మావతి గతంలో కోదాడ ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పద్మావతి అభ్యర్థిత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో చామల కిరణ్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు ఇది పెద్ద వివాదంగా మారింది. మరి ఈ నేపథ్యంలో ఫైనల్‌గా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ? బరిలో ఉంటారో ? చూడాలి.