ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి రాజకీయాలు. అధికార టీడీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీలోకి వలసలతో టీడీపీ హైకమాండ్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే వైసీపీలోకి టీడీపీకి చెందిన ముఖ్యులు చేరగా.. తాజాగా.. కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మంగళవారం ఉదయం వైఎస్ జగన్‌ను కలవనున్నారట. జగన్‌ను కలిసిన అనంతరం ఆయన సమక్షంలో ఆమె రేపే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
కిల్లి కృపారాణిది టెక్కలి నియోజకవర్గం. శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ ఎంపీగా వరుసగా 2004, 2009, 2014లో పోటీ చేశారు. 2004, 2014లో ఆమె ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో గెలిచి… కేంద్ర ఐటీ, కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.