ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఏపీలో సైతం వణికిస్తుంది. ఏపీలో ఇప్పటకే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరుకుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 10 మంది కోవిడ్ నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు కోవిడ్‌కు బలి కాగా.. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 365 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే.. యాచకులు, నిరాశ్రయులపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు, పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, మానవతావాదులు రోడ్లపైకి వచ్చి గత కొంత కాలంగా యాచకులు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. దీని వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించిన అధికారులు వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై రోడ్లపై యాచకులు కనిపిస్తే వారిని వెంటనే షెల్టర్లకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 బస్సుల ద్వారా 250 మందికి పైగా యాచకులను షెల్టర్లకు తరలించినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఇక విజయవాడ పరిధిలోని 10 షెల్టర్ల లో యాచకులను ఉంచుతామని, మిగతా నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనా కరోనా కట్టడికి ఇది కూడా ఓ మంచి నిర్ణయమే అని చెప్పాలి.