తెలంగాణలో ఎన్నికలు ఈసారి రసవత్తరంగా ఉన్నాయని తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తూ కాంగ్రెస్, బిజెపి కూడా తలపడుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలలో రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉంటే, కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తీవ్రస్థాయిలో ఉందని చెప్పవచ్చు.
అతిపెద్ద నియోజకవర్గాలలో త్రిముఖ పోరు హోరాహోరీగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మూడు పార్టీల తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు ఒకప్పటి మిత్రులే. ఒకే పార్టీలో ఉండి ఒకరి గెలుపు కోసం ఒకరు కృషి చేసిన వారే. ఇప్పుడు ఆ ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తూ తమను గెలిపించమంటూ ప్రజల ముందుకు వెళుతున్నారు. వారెవరో కాదు నన్నపనేని నరేందర్, కొండా సురేఖ, ఎర్రబెల్లి ప్రదీప్ రావు.
బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పోటీ చేస్తూ ఉండగా, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరిన కొండా సురేఖ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కారులో తనకు సరైన స్థానం దక్కలేదని కమలం గూటికి చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరూ 2014లో బిఆర్ఎస్ లోనే ఉన్నారు. 2018 తర్వాత నన్నపనేని నరేందర్ కు టికెట్ ఇవ్వటంతో ఒకరి తర్వాత ఒకరు కొండా సురేఖ, ఎర్రబెల్లి పార్టీని వీడారని చెప్పవచ్చు. ఇప్పుడు పోరు మూడు పార్టీల మధ్య కాదు, ముగ్గురు వ్యక్తుల మధ్య పోరు హోరాహోరీగా ఉంది. ముగ్గురు నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతలే. బిఆర్ఎస్ నుంచి నరేందర్ కు నియోజకవర్గంలో పేరు ఉంది. మరి మిత్రుల మధ్య జరుగుతున్న ఈ సమరంలో వరంగల్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే…..