ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థి గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధిని చూపిస్తూ బిఆర్ఎస్ ఓట్లడుగుతుంటే, బిఆర్ఎస్ చేసింది అభివృద్ధి కాదు అవినీతి అక్రమాలు అంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రజల ముందుకు వెళుతున్నాయి.
ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న నియోజకవర్గం కోదాడ నియోజకవర్గం. ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఓట్లే కీలకం. ఈ నియోజకవర్గం లో బిఆర్ఎస్ తరఫున మల్లయ్య యాదవ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుండి ఉత్తమకుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి బరిలో దిగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని మల్లయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమకుమార్ రెడ్డి తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న నియోజకవర్గంలో తన సతీమణి గెలిపించుకోవడం సునాయాసమే అంటూ బరిలో దిగారు. బిఆర్ఎస్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తనకు అండగా ఉంటాయని మల్లయ్య ప్రజల ముందుకు వెళుతున్నారు. సొంత పార్టీలో అసమ్మతి ఉన్నా దానిని పక్కన పెట్టి ప్రజలలో మమేకమవుతూ ఎన్నికల్లో విజయం కోసం మల్లయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకు వెళుతూ ఉత్తంకుమార్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
మరి కోదాడ ప్రజలు ఉత్తమ్ కు ఓటేస్తారా??? లేక మల్లయ్యకే మళ్లీ పట్టం కడతారా???