అమరావతి(విజయనగరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమకు న్యాయం జరుగుతుందని విజయనగరం జిల్లా సారిపల్లి గ్రామానికి చెందిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు విశ్వాసం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితేనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన భూ నిర్వాసితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. రెండు పంటలు పండే 1400 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం పరిహారం మాత్రం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని, పరిహారం ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా న్యాయం జరగటంలేదని వాపోయారు.
స్వర్ణ కారులకు హామీ ఇచ్చినట్టే తమను కూడా ఆదుకోవాలని విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. విశ్వ బ్రాహ్మణుల్లో కార్పెంటర్లు, శిల్పం, కంచర, కమ్మర ఈ నాలుగు ఉపకులాలను ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు. కార్పెంటర్లకు ప్రభుత్వ టింబర్ డిపోలనుంచి రాయితీ, సబ్సీడీతో కలప సరఫరా చేయాలని కోరారు.