అప్పుడు చంద్రబాబు కు..ఇప్పుడు జగన్‌కు…వైసీపీకే మైనస్…!

-

రాజకీయాల్లో పార్టీ అధినేతలని నాయకులు పొగడటం చాలా సహజం. అయితే అధినేతలు చేసే పనులు బట్టి నాయకులు పొగిడితే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు పొగిడితే, అదే పెద్ద మైనస్ అవుతుంది. అయితే ఇప్పుడు నాయకులు ఎక్కువగా పదవుల కోసం అధినేతలకు బాగా భజన చేసే పనిలో ఉంటున్నారు. ఈ భజన వల్లే టీడీపీ అధినేత చంద్రబాబు చాలావరకు నష్టపోయారు.

గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు టీడీపీ నేతలు ఏ స్థాయిలో భజన చేసేవారో చెప్పాల్సిన పని లేదు. పదవులు దక్కించుకోవడం కోసం దొరికిందే ఛాన్స్ అంటూ నాయకులు అదే పనిలో ఉండేవారు. ఓ రకంగా గుడిల్లో దేవుళ్ళకు భజన ఏమన్నా తగ్గి ఉంటుందేమో గానీ, టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబుకు , సొంత నాయకులు చేసే భజన ఏ మాత్రం తగ్గేది కాదు. ఇలా జరగడం వల్ల పార్టీలో ఉన్న నెగిటివ్ చంద్రబాబుకు తెలిసేది కాదు. దాని వల్ల 2019 ఎన్నికల్లో టీడీపీకి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగిందో చెప్పాల్సిన పని లేదు.

సరే ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చిన జగన్,… ఈ భజనలకు దూరంగా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ నాయకులు ఖాళీగా ఉండరుగా..జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏ స్థాయిలో భజన చేస్తూ వచ్చారో అంతా చూశారు. అసలు అసెంబ్లీలో జగన్‌పై ఎలాంటి పొగడ్తల వర్షం కురిపించారో చెప్పాల్సిన పని లేదు.

ఇలా వైసీపీ నేతలు, జగన్‌కు చేసే భజన కంటిన్యూ అవుతూనే ఉంది. ముఖ్యంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్‌కు అదే పనిగా భజన చేసే కార్యక్రమంలో ఉన్నారు. మంత్రులు ఏమో తమ పదవులని నిలుపుకోవాలని, ఎమ్మెల్యేలు ఏమో మంత్రులుగా ఛాన్స్ కొట్టేయాలని జగన్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరి ఈ భజన కార్యక్రమం వల్ల చివరికి వైసీపీకి కూడా నష్టం జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి వైసీపీ నేతల భజన ఏ స్థాయికి వెళుతుందో?

 

Read more RELATED
Recommended to you

Exit mobile version