2019 సార్వత్రిక ఎన్నికల్లో బలమైన మెజారిటీతో ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్ ‘నవరత్నాలు’ పేరిట స్కీమ్స్ ప్లస్ మేనిఫెస్టో ప్రకటించిన ప్రజల ఆదరణను చూరగొన్నారు. కాగా, విభజిత ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జగన్ పాలన ఎలా ఉంది? అనే విషయమై ప్రముఖ పత్రిక ఇండియా టుడే ‘ది మూడ్ ఆఫ్ దినేషన్’ పేరిట సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో జగన్‌కు ప్రజాదరణ భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పని తీరును సమీక్షించేందుకు ఈ సర్వే చేశారు. సర్వేలో టాప్ 10లో ఉన్న సీఎం జాబితాను అనౌన్స్ చేయగా, వీరిలో ఏపీ సీఎం జగన్ పేరు లేదు. గతేడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఏపీ సీఎం జగన్ నాలుగో ఉత్తమ సీఎంగా ఉన్నట్లు తేలగా, ఈ సారి పదిస్థానాల్లోనూ ఎక్కడా కనిపించలేదు. మొత్తంగా ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం తగ్గిపోయిందనే విషయం ఈ సర్వే ద్వారా తేలిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతేడాది కంటే 11 శాతం ప్రజాదరణ ఈసారి తగ్గిపోయినట్లు సర్వే తేల్చిందట.
అయితే, ఇతర రాష్ట్రాల కంటే కూడా ఏపీలోనే అధికంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయనేది ప్రజల మాటగా సర్వేలో జనాలు పేర్కొన్నారట. గతేడాది సర్వేలో జగన్‌కు నాల్గో స్థానం వచ్చిన క్రమంలో ఏపీలో కొన్ని మీడియా సంస్థలు భారీ ఎత్తున ప్రచారం చేశాయి. కానీ, ఇప్పుడు మాత్రం ఈ సర్వే విషయమై ప్రచారం విషయంలో సైలెంట్ అయ్యాయి ఆ సంస్థలు. ఇటీవల కాలంలో బీజేపీ ఏపీ నేతలు ఏపీ సర్కారు నిబంధనలు అతిక్రమించి అప్పులు చేస్తోందని కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణ సీఎం విషయానికొస్తే.. ఆయన కూడా టాప్ టెన్ సీఎంల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు.