రాజద్రోహం కింద అరెస్టు అయిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం గందరగోళంగా తయారైంది. తనను సీఐడీ పోలీసులు కొట్టారంటూ ఎంపీ ఆరోపణలు చేయడంతో రాజద్రోహం విషయం పక్కకు పోయి కొట్టారా లేదా అన్న విషయంపై కోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసింది. అయితే మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయనకు ఎడిమా ఉందని, అందుకే కాళ్లకు వాపు, రంగు వచ్చాయని చెప్పింది.
ఇదే విషయంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదిక చాలా గందరగోళంగా స్పష్టత లేకుండా ఉంది. ఆ నివేదిక ప్రకారం ఎంపీ కాలు ఫ్యాక్చర్ అయింది, అలాగే బొటన వేలు, పక్కన వేలుకు గాయాలయ్యాయని చెప్పింది.
ఇక్కడ ట్విస్టు ఆర్మీ ఆస్పత్రి నివేదికలో కూడా ఎంపీకి ఎడిమా ఉందని చెప్పింది. అలాగే ఆ గాయాలు కూడా కొట్టడం వల్ల వచ్చాయని చెప్పలేమని వివరించింది. అవి ఎడిమా వల్ల వచ్చాయా లేదా కొట్టడం వల్ల వచ్చాయా అనేది స్పష్టంగా చెప్పలేదు. దీంతో కోర్టు జడ్జి కూడా దేన్ని స్పష్టంగా నిర్ధారించలేదు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశమైంది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక కాస్త సీఐడీకి అనుకూలంగానే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎంపీకి బెయిల్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం.