మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందంటూ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. 50 రోజులు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు సీఐడీ అధికారులు కూడా చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా. అయితే ఇప్పుడు టీడీపీ నేతలతో పాటు కిందిస్థాయి కార్యకర్తల్లో కూడా వినిపిస్తున్నది ఒకటే మాట… అదేమిటంటే… చంద్రబాబు తర్వాత పార్టీని ముందుకు నడిపించే నేత ఎవరూ… అనే ప్రశ్న ప్రస్తుతం పార్టీలో తెగ వినిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం.. చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వాస్తవానికి చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నేత ఎవరూ అనే ప్రశ్న 2009 నుంచి వినిపిస్తోంది. 2009 ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. కానీ అప్పట్లో పార్టీ తర్వాత నేత ఎవరనే ప్రశ్న తెగ వినిపించింది. జూనియర్ నిర్వహించిన సభలకు టీడీపీ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో సభలు సూపర్ సక్సెస్ కూడా అయ్యాయి. ఇక వాక్‌చాతుర్యంతో పాటు ఆకట్టుకునే రూపం.. వీటన్నిటికీ మించి నందమూరి తారక రామారావు మనవడు అనే ముద్ర కూడా జూనియర్ పైన బలంగా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతలు చేపడతాడు అనే మాట కూడా వినిపించింది. అదే సమయంలో నారా లోకేశ్ రాజకీయాల్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. దీంతో అన్ని వేళ్లు జూనియర్ వైపు చూపించాయి. కానీ సరిగ్గా అదే సమయంలో నారా లోకేశ్ రంగప్రవేశం చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
2014 ఎన్నికల నాటికి జూనియర్‌ను పూర్తిగా పక్కన పెట్టిన చంద్రబాబు… లోకేశ్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో పార్టీ నేతలంతా లోకేశ్ వెంట నడిచారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కోటాలో లోకేశ్‌ను కీలకమైన శాఖలకు మంత్రిగా కూడా చేశారు చంద్రబాబు. దీంతో ఇక చంద్రబాబు తర్వాత లోకేశ్ అని నేతలంతా ఫిక్స్ అయ్యారు. అయితే మంగళగిరిలో ఓటమి… తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న లోకేశ్.. యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. భవిష్యత్తు నేత లోకేశ్ అని పార్టీ నేతలంతా ఫిక్స్ అవుతున్న సమయంలో… చంద్రబాబు అరెస్టుతో పరిస్ఖితి మళ్లీ మొదటికి వచ్చింది. పాదయాత్రకు బ్రేక్ పెట్టిన లోకేశ్… ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. ఇక్కడ పార్టీ విషయాలపై జూమ్ మీటింగ్ ద్వారా ఆదేశాలిస్తున్నారు తప్ప… క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది ఏ మాత్రం పట్టించుకో లేదు. చివరికి ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. దీంతో పార్టీని నడిపే నేత కరువయ్యాడనేది క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయం.