తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాషాయ దళం ఇక ప్రచారంపై ఫోకస్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాతే రాష్ట్రంలో ప్రచార జోరు పెంచాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రక్రియ తర్వాతే జాతీయ నేతలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. బీసీ సీఎం నివాదంతో ప్రజల్లోకి వెళ్తున్న కమలం పార్టీ.. బీసీ బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభల్లో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 7, 11వ తేదీల్లో రాష్ట్రానికి వస్తున్నారు.
అయితే తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తించి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నాయకుల కోసం మూడు హెలికాప్టర్లు సమకూర్చినట్లు సమాచారం. ఈ మూడింటిల్లో ఒకటి పూర్తిగా కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కు కేటాయించగా.. మరో రెండు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు సమాచారం. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.