ఇద్దరు చంద్రుల్లో ఢిల్లీలో రాజకీయ చక్రం తిప్పబోయే చంద్రుడు ఎవరో?

-

ఇప్పటికే ఆరు విడుతల్లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఇంకో విడుత ఉంది అంతే. ఎన్నికల ఫలితాల సమయం కూడా దగ్గర పడుతోంది. ఇంకో పది రోజుల్లో అందరి భవితవ్యం తేలబోతోంది. అందుకే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలర్ట్ అయిపోయారు.

ఇద్దరూ చంద్రులే.. ఒకాయన తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు.. ఇంకోకాయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇద్దరి పేర్లలో చంద్రుడు ఉన్నాడు. కానీ.. ఇద్దరికి మాత్రం క్షణం పడదు. ఇద్దరి టార్గెట్ ఒక్కటే. ఢిల్లీ.. కానీ వాళ్ల దారులు వేరు.

ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల తోడు కావాల్సిందే. అవే ఇప్పుడు కీలకం కానున్నాయి. దీంతో తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్.. అటు ఆంధ్రా నుంచి చంద్రబాబు నరుక్కుంటూ వస్తున్నారు. కేంద్రంలో నేను చక్రం తిప్పుతానంటే నేను తిప్పుతానంటూ ఒకరికి మరొకరు సవాళ్లు విసురుకునేంత పని చేస్తున్నారు.

ఇప్పటికే ఆరు విడుతల్లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఇంకో విడుత ఉంది అంతే. ఎన్నికల ఫలితాల సమయం కూడా దగ్గర పడుతోంది. ఇంకో పది రోజుల్లో అందరి భవితవ్యం తేలబోతోంది. అందుకే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలర్ట్ అయిపోయారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను కూడగట్టడానికి బయలు దేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడే లోపు.. దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి వాళ్ల మద్దతును కూడగట్టి.. ఫెడరల్ ఫ్రంట్ ను అధికారంలోకి తీసుకురావాలనేది కేసీఆర్ ప్లాన్.

మరోవైపు చంద్రబాబు కూడా బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో ఈసారి గెలవనివ్వకూడదని తెగ ప్రయత్నిస్తున్నారు. మోదీకి, చంద్రబాబుకు చెడిన విషయం తెలిసిందే కదా. దాదాపు నాలుగేళ్ల పాటు మోదీతో సంసారం చేసిన చంద్రబాబు… ప్రత్యేక హోదా విషయంలో మోదీ నుంచి విడిపోయి… ప్రస్తుతం రాహుల్ తో జత కలిశారు. అయితే.. రాహుల్ తో జత కలిసినప్పటికీ… రాహుల్ ను ప్రధాని చేయాలి అనే కాన్సెప్ట్ తో కాకుండా… తనే కేంద్రంలో చక్రం తిప్పాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారట.

కేసీఆర్ మాత్రం.. తనకు ప్రధాని పదవి రాకున్నా ఏం లేదు కానీ… అటు బీజేపీ కానీ.. ఇటు కాంగ్రెస్ గానీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదన్న ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. ఈనేపథ్యంలోనే సౌత్ ఇండియాలోని ముఖ్యమైన ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగడుతున్నారు. ఇప్పటికే కేరళ వెళ్లి సీఎం పినరయి విజయన్ ను కలిశారు. కర్ణాటక సీఎం కుమార స్వామితో ఫోన్ లో మాట్లాడారు. ఇవాళ తమిళనాడు వెళ్లి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను కలిశారు. ఇప్పటికే ఏపీలో జగన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. వీళ్లందరి మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పాలనేది కేసీఆర్ వ్యూహం. ప్రధానిని డిసైడ్ చేయాలనేది కేసీఆర్ ప్లాన్.

ఇలా.. ఓవైపు చంద్రబాబు.. మరోవైపు కేసీఆర్.. ఇద్దరూ కేంద్రంలో చక్రం తిప్పడానికి పడాల్సిన పాట్లన్నీ పడుతున్నారు. ఇద్దరి టార్గెట్ ఢిల్లీయే కావడం.. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ముందు పడి మరీ.. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే.. ఈ ఇద్దరిలో ఎవరు ఢిల్లీలో చక్రం తిప్పుతారు.. ఎవరు తిప్పరు .. అనేది తెలియాలంటే మాత్రం మే 23 దాకా ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version