చంద్రబాబు ఎందుకు ఎదురు చెప్పటం లేదంటారు…?

-

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మాటే ఫైనల్. బాబు మాట కాదనే ధైర్యం ఎవరికీ లేదంటారు కూడా. అదే సమయంలో చంద్రబాబు మాట కాదని ముందుకు వెళ్లే నేతలు పార్టీలో లేరు కూడా. అలాంటి చంద్రబాబు కూడా ఇప్పుడు కొందరి మాట కాదనలేకపోతున్నారు. అలాగే చంద్రబాబు మాటలను కూడా కొందరు నేతలు లెక్క చేయడం లేదనేది అక్షర సత్యం. టికెట్ల కేటాయింపు అంశం తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందనే చెప్పాలి. ఒక్కసారి పోటీ చేసిన నేత… తన పట్టు నిలుపుకునేందుకే ప్రయత్నం చేస్తారు తప్ప… ఈసారి మాత్రమే నేను అనే మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనరు. అందుకే గెలుపు ఓటముల కంటే కూడా రాజకీయాల్లో పార్టీ టికెట్ సాధించడమే కీలకమంటారు రాజకీయ విశ్లేషకులు.

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను ఈసారికి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని కాదని… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సూచించిన గోండు శంకర్‌కు టికెట్ కేటాయించారు చంద్రబాబు. దీంతో గుండ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది కూడా. చివరికి చంద్రబాబుతో హైదరాబాద్ ఇంట్లో స్వయంగా సమావేశం కూడా అయ్యారు. అయితే జిల్లాకు వచ్చిన సమయంలో నేరుగా అందరితో మాట్లాడుతా అంటూ చంద్రబాబు చెప్పడంతో చేసేది లేక తిరుగు ప్రయాణం అయ్యారు.

చెప్పినట్లుగానే సిక్కోలు పర్యటనకు వచ్చిన చంద్రబాబు…. అందరి సమక్షంలోనే టికెట్లు ఇచ్చిన నేతలకు ప్రతి ఒక్కరు సహకరించాలి అంటూ తేల్చేశారు. దీంతో గుండ దంపతులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిన్నటి వరకు తన వెంట తిరిగిన నేత కోసం ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేయాలంటే కొంత ఇబ్బంది అని… పైగా ఆరోపణలు కూడా చేశామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగటం కష్టమని చంద్రబాబుకు తేల్చి చెప్పారు. మరో పార్టీలో చేరేది లేదని కూడా చెప్పిన గుండ దంపతులు.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో నిన్నటి వరకు గుండ గ్రూప్‌లో కొనసాగిన నేతలంతా ఒక్కొక్కరుగా గోండు శంకర్‌కు మద్దతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version