అధికారం పోతేనే కానీ, రాజకీయ నేతలకు అసలు విషయం ఏంటో అర్ధం కాదనేది నానుడి! ఇప్పుడు అచ్చు ఇదే పరిస్థితి ప్రతిపక్షం టీడీపీలో కనిపిస్తోంది. గత ఐదేళ్లలో తాము పాలన ఎలా చేశామనే విషయాన్ని ఆలో చించడం మానేసి.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్న పాలనపై వేలు చూపిస్తున్నారు. అప్పట్లో ఎవరు సలహా ఇచ్చినా.. నేను ప్రపంచం గెలిచిన మేధావిని, దేశంలో నాకన్నా సీనియర్ అంటూ ఎవరూ లేరని ప్రసంగాలు గుప్పించిన చంద్రబాబు ఏమేరకు పాలించారో.. ఎవరి సూచనలు పరిగణనలోకి తీసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. తన అవసరం వస్తే.. ఒక రకంగా.. తన అవసరం లేకపోతే.. మరోరకంగా వ్యవహరిస్తారనే పేరును బాబు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం లేదు. ఎవరి సలహానూ తీసుకోవడం లేదు. జగన్ తనకు తోచి నట్టు పాలిస్తున్నారు.. ఈ రాష్ట్రం ఏమన్నా.. ఆయన అబ్బ జాగీరా?- ఇదీ రెండు రోజుల కిందట చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్య. మరి ఇదే బాబు గారు రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన సమయంలో ఆయన ఇదే ప్రతిపక్షాలను పిలిచి ఏనాడైనా చర్చించారా? ఆయన కాళ్ల కిందకు నీళ్లొచ్చినప్పుడు, లేదా కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో అఖిల పక్షం అంటూ ఒకటి ఉంటుందనే విషయం ఆయనకు గుర్తుకు వచ్చింది. అలాంటి నాయకుడు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయడం సమంజసమేనా? అనేది కీలక ప్రశ్న.
ఇక, ఇప్పుడు టీడీపీలో నెంబర్-2 నాయకుడు, చంద్రబాబు రైట్ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న సీనియర్ నాయకుడు, వివిధ పదవులు సాగించిన యనమల రామకృష్ణుడు కూడా ఇదే తరహాలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం ఆదా చేస్తోందని చెబుతూనే దుబారా ఖర్చులు పెరిగిపోయాయని, ఆయన కేసులకు వాదించే సొమ్మును సొంత నిధుల నుంచి ఖర్చు చేయాలని సూచించారు. మంచిదే. సొంత కేసులు కాబట్టి ఆయన ఇలా అడగడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, జగన్ ఈ పని ఎప్పుడో చేశారనే విషయాన్ని ఆయన మరిచిపోయారు. టీడీపీ నేతల మాదిరిగా విదేశాల్లో సొంత పనులకు వెళ్లి కూడా ప్రజాధనం ఖర్చు పెట్టినట్టు జగన్ అలా చేయడం లేదు.
తన సొంత పనులకు వెళ్లినప్పుడు తన వెంట ప్రభుత్వ అధికారులను తీసుకువెళ్లిన సమయంలోనూ సొంత నిధులనే వారికి కేటాయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. అదేవిధంగా తన కేసులకు సంబందించి ఇంతక న్నా ఎక్కువగా ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఖర్చు పెట్టారు. ఆయన చేసే ప్రతి రూపాయి కూడా సొంత నిధులేనన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా కూడారాజకీయంగా ఏదో ఒక విధంగా బద్నాం చేయడం కంటే .. టీడీపీ నేతలకు మరో అవకాశం లేదా? అనిపించేలా ఉన్నయనమల వ్యాఖ్యలు సొంత పార్టీలో నే చర్చకు దారితీశాయి.