ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి విశాఖలో నిరసన సెగ తగిలింది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుకి వైసీపీ కార్యకర్తలు అడ్డు చెప్పారు. చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులతో దాడి చేసారు. అదే విధంగా ఆయన కాన్వాయ్ కి అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. దీనితో చంద్రబాబు నాయుడు గంట నుంచి విమానాశ్రయంలోనే ఉన్నారు. ఆయన కాన్వాయ్ ని కార్యకర్తలు ముందుకి కదలనీయలేదు.
చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా చంద్రబాబు వాహనం దిగి నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేసారు. వెంటనే వైసీపీ కార్యకర్తలు ఆయన వద్దకు వచ్చారు. దీనితో మళ్ళీ చంద్రబాబు వెంటనే కారు లోపలి ఎక్కారు. ఇక ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీనితో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాన్వాయ్ ముందుకి వెళ్ళే పరిస్థితి లేదని పోలీసులు చంద్రబాబుకి స్పష్టం చేసారు.
విమానాశ్రయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొంత మంది మహిళా కార్యకర్తలు చంద్రబాబు ఫోటోని చెప్పులతో కొట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు ఇలాగే చేసి ఉంటే వైఎస్సార్ జగన్ యాత్ర చేసేవారా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. భూకబ్జాలు చేస్తున్నారని అవి బయటపడతాయి అనే అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు.
ఇది కచ్చితంగా జగన్ నేతృత్వంలో జరిగిన దాడే అని టీడీపీ నేతలు ఆరోపించారు. కావాలనే చంద్రబాబుని అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపించారు. దీనితో విమానాశ్రయం వద్దకు భారీగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. అటు పోలీసులు కూడా పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.