ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఇవాళ విశాఖలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్చటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విశాఖ పర్యటనలో ఉత్కంఠ నెలకొంది. విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న తరువాత చంద్రబాబు తొలిసారి విశాఖకు రానుండటంతో ఆయనకు విశాఖలో ఎలాంటి అనుభవం ఎదురవుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే చంద్రబాబు కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండగా, వైసీపీ కార్యకర్తలు సైతం వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం గమనార్హం.
ఇక ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్య యాత్ర చేపట్టేందుకు విశాఖ చేరుకున్న చంద్రబాబుకు వైసీపీ నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. వైసీపీ నేతలు ‘గో బ్యాక్ చంద్రబాబు..ఉత్తరాంధ్ర ద్రోహి’ అంటూ పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ-వైసీపీ నేతల మధ్యన వాగ్వాదం జరుగుతుండటం తో పోలీసులు ఇరు వర్గాల్ని శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌ను ఎయిర్ పోర్టు దగ్గరే అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. ఆయన కాన్వాయ్‌ను ముందుకు కదలనివ్వలేదు. దాదాపు అరగంట పైనే చంద్రబాబు కాన్వాయ్ విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గరే నిలిచిపోయింది.