చంద్ర‌బాబు ఉచిత పంట బీమా ఏమైంది… సీఎంపై వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ సెటైర్లు

-

రైతు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుంది…ఏపీ సీఎం చంద్రబాబుకి ఈ వాస్త‌వాన్ని గుర్తు చేస్తున్నారు మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని జ‌గ‌న్ గుర్తుచేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్‌-మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నారు.

ఖరీఫ్‌ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటాను విడుద‌ల చేసేది. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇదే మాదిరిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించారు.తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో ఏపీ దేశంలోనే పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన కూట‌మి ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటా గురించి అస‌లు ప్ర‌స్థావ‌న చేయ‌డం లేదు. ఇప్పటికే జూన్‌, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా కూట‌మి ప్ర‌భుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరమ‌ని జ‌గ‌న్ అంటున్నారు.

ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్ర‌మాదం ఉంది.ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలని జ‌గ‌న్ డిమాండ్‌ చేస్తున్నారు.

రైతుల‌కు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా రూ.20వేలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌ హామీల్లో చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతు భరోసా అందించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించిన‌ట్లు జ‌గ‌న్ గుర్తు చేస్తున్నారు.

ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశామ‌ని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడులకోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీవ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే పరిస్థితులను వ‌చ్చాయి. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు ఇస్తానన్న డబ్బులు సహా, ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించి 2023-24కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ సొమ్మును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయ‌డం వెనుక రైతులంటే జ‌గ‌న్‌కి ఎంత అభిమాన‌మో అర్థం చేసుకోవ‌చ్చు.ప్ర‌తిప‌క్షంలో ఉన్నా రైతు ప‌ట్ల బాధ్య‌త‌ను జ‌గ‌న్ గుర్తు చేసుకుంటున్నారు. మ‌రి కూట‌మి ప్ర‌భుత్వం ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version