రాజధాని అమరావతి నిర్మాణాల్లో మరియు మాస్టర్ ప్లాన్ విషయమై అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓ ఫిర్యాదును సీఐడీ ఎదుట ఫైల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టే నిమిత్తం ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఏ1గానూ, మాజీ మంత్రి నారాయణను (అప్పటి మున్సిపల్ శాఖ నిర్వాహకులు, రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యులు) ఏ2గానూ పేర్కొంటూ మరికొందరి పేర్లనూ చేరుస్తూ సీఐడీ ఇవాళ కేసులు నమోదు చేసింది.
కాసేపట్లో టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో హైద్రాబాద్ కేంద్రంగా అరెస్టు అయిన నారాయణ మరోసారి అరెస్టు అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. ఈయన్ను ఈ సాయంత్రం దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపిస్తారు. ప్రస్తుతం ఆయనను పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడిగా చూపిస్తూ.. పలు ఆరోపణలపై అరెస్టు చేశాక హైద్రాబాద్ నుంచి చిత్తూరుకు తరలిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి నిన్నటి నుంచే సమాలోచనలు జరుగుతున్నాయని దర్యాప్తు అధికారుల నుంచి అందుతున్న సమాచారం.
ఓ వైపు జిల్లాల పర్యటనలతో, పొత్తుల కు సంబంధించిన చర్చోపచర్చలతో సతమతం అవుతున్న టీడీపీకి ఇదొక పెద్ద కుదుపు. హఠాత్ పరిణామం నుంచి కోలుకోవడం కష్టమే అని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఆ రోజు మందుల కొనుగోలుకు సంబంధించి అచ్చెన్నాయుడు (అప్పటి కార్మిక శాఖ మంత్రి) ను శ్రీకాకుళం వచ్చి మరీ ! కరోనా కాలంలో దర్యాప్తు అధికారులు అరెస్టు చేసి తీసుకుని వెళ్లారు. కానీ ఆ రోజు ఈఎస్ఐ స్కాంకు సంబంధించి ఏమీ నిరూపించలేకపోయారు. అదేవిధంగా ఇప్పుడు కూడా తమ నాయకుడికి క్లీన్ యూ దక్కడం ఖాయమేనని అంటున్నాయి టీడీపీ వర్గాలు. మరోవైపు మరికొద్దిసేపట్లో చంద్రబాబును కూడా అరెస్టు చేస్తారని, అరెస్టు ఈ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఉండవచ్చని కూడా తెలుస్తోంది. వీటి నిర్థారణను సంబంధిత దర్యాప్తు అధికారులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం చంద్రబాబుపై కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు అయి ఉన్నాయి. సీఐడీ నేతృత్వాన అరెస్టు ఈ రోజు కానీ రేపు కానీ డిక్లైర్ అయితే రాష్ట్రంలో మరిన్ని పరిణామాలు అనూహ్యరీతిలో జరగనున్నాయి.