ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడు నెలల సమయం ఉన్న ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు, రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు, సమావేశాలు ముందస్తు ఎన్నికల వేడిని ఇంకా పెంచుతున్నాయి. వైసిపి కోర్ కమిటీ సమావేశం, పనితీరు సరిగా ఉన్న ఎమ్మెల్యేలకి టికెట్లు అని జగన్ నిర్ణయం, వైసీపీ కొంతమంది అభ్యర్థులతో తొలి విడత జాబితాను విడుదల చేశారని సోషల్ మీడియాలో వార్తలు హలచల్ చేస్తున్నాయి.
ముందస్తు ఎన్నికలు జగన్ వ్యూహమా లేక కేంద్రంలోని బిజెపి సూచన మేరకే ముందుగా ఎన్నికలకు వెళుతున్నారా అనే విషయం గురించి తెలుసుకోవాలని రాజకీయ విశ్లేషకుల ప్రయత్నం. వైసిపి అధికారాన్ని చేపట్టిన నాలుగు సంవత్సరాలలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ పథకాలను సకాలంలో అందిస్తున్నారు. కానీ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులు ప్రభావం పథకాల అమలుపై పడుతుంది. పథకాల అమలు కోసం ఇంకా కొత్త అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల పథకాల అమలు ఆలస్యం అయితే అధికార పార్టీకి ఉన్న అనుకూల ప్రభావాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రజలలో పథకాల అమలు సక్రమంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. ప్రతిపక్షం నేతలు చేసే ఆరోపణలు విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. రోజు ఒక ఏదో ఒక కొత్త సమస్యపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
టిడిపి, జనసేన నేతలు చేసే ఆరోపణలను త్రిప్పి కొట్టడంలో అధికార పార్టీ నేతలు వెనుకబడి ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిపక్ష నేతలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇక టిడిపి దూకుడుని కట్టడి చేయాలని వైసీపీనే గొడవలు సృష్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు టిడిపి శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి.
ఇక ఎంత అధికార బలం ప్రయోగించిన టిడిపి వెనక్కి తగ్గడం లేదు. దీంతో రోజురోజుకూ వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, ప్రజలలో పార్టీ మీద ఉన్న సానుకూల దృక్పథాన్ని ఓట్లు గా మార్చి మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నా జగన్‌కు ఉన్న ఏకైక మార్గం ‘ముందస్తు’ ఎన్నికలే. కానీ తెలంగాణతో సహ ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు లేవు.
సాధారణ ఎన్నికలు ఎలాగో విడతల వారీగా జరుగుతాయి కాబట్టి..అప్పుడే కొత్త సంవత్సరం మొదట్లోనే ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేయవచ్చు. చూడాలి మరి జగన్ ఏం చేస్తారో.