వలంటీర్లకు గౌరవ వేతనం పెంచే దిశగా ఓ వైపు ఆలోచిస్తూ సంబంధిత చర్యలు చేపడుతూనే మరోవైపు త్వరలో ఆరోగ్య మిత్రలకూ తగిన గుర్తింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. ఇప్పటికే వలంటీర్లకు వందనం పేరిట ఉత్తమ సేవలు అందించిన వారికి సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరిట సన్మానాలు చేస్తున్న వైనం వార్తల్లో నిలుస్తోంది. ఓ విధంగా చాలా మంది వలంటీర్లకు శక్తివంచన లేకుండా పనిచేసిన వలంటీర్లకు ఇది ఒక గొప్ప వరం.
ఎందుకంటే క్షేత్ర స్థాయి ఒత్తిళ్లను దాటుకుని, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ తమకు అప్పగించిన బాధ్యతల పూర్తికి అహరహం పరిశ్రమించిన వారికి ఓ మంచి గుర్తింపు ఇవ్వడం అదీ ప్రభుత్వం తరఫున దక్కడం సమయోచితం. అందుకే ముఖ్యమంత్రి వారికి పది వేలు, ఇరవై వేలు, 30 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు, అదేవిధంగా మెడల్, శాలువ, సర్టిఫికెట్ అందించి మరింత బాగా పనిచేయాలని విన్నవిస్తున్నారు.
ఇప్పటికే సచివాలయ వ్యవస్థ గ్రామ స్థాయిలో, పట్టణ మరియు నగర స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. ఇదే విధంగా పనిచేస్తే తమ పాలన స్థానికంగా మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు మరిన్ని ఉన్నాయని జగన్ భావిస్తున్నారు.
ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు పై త్వరలోనే సర్వే కూడా చేయించనున్నారు. దీని ఆధారంగా వలంటీర్లను అప్రమత్తం చేసి అర్హులయిన వారికి పథకాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. అందుకే వలంటీర్లను మరింత కీలకం చేసే క్రమంలోనే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా ప్రజాప్రతినిధుల నుంచి తగిన గుర్తింపు మరియు సముచిత గౌరవం దక్కేలా చేస్తున్నారు.
ఇది ఓ విధంగా వారికి బూస్టింగ్ పాయింట్ కానుంది. కొందరు ఇంకాస్త గొప్పగా పనిచేసేందుకు, సమర్థ రీతిలో ప్రభుత్వ పథకాల అమలు చేసేందుకు ఉపయుక్తం కానుంది. అందుకే వలంటీర్ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు మరికొన్ని మంచి నిర్ణయాలుతీసుకున్నారు. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో ఆరోగ్య మిత్ర లు పనిచేస్తున్నారు. వారికి కూడా నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఏడాదిలో ఒక రోజును ఎంపిక చేసి ఇవ్వాలని నిర్ణయించారు అని ప్రధాన మీడియా వెల్లడి చేస్తోంది. నిన్నటి వేళ వైద్యారోగ్య శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.