పోలియో చుక్కల మాదిరి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి

-

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రచారం పట్ల ఉన్న శ్రద్ధ దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితులు పైన లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. యాభై ఆరు ఇంచుల ఛాతి ఉందని చెప్పిన ప్రధాని దేశంలో అనేక మార్పులు తీసుకోస్తారని ప్రజలు ఆశించారని, కానీ ప్రధాని ఒక కరోనా మహమ్మారి వస్తే దాన్ని నివారించే ప్రయత్నం చేయలేదని అన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదని, దేశంలో ఆక్సిజన్ లేక, రెమిడిసివర్ ఇంజెక్షన్లు లేక, వ్యాక్సిన్లు లేక ప్రజలు అల్లాడుతుంటే ప్రధానికి కనికరం కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు.

 

కేంద్రానికి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారి పైన చర్యలు తీసుకునే సమయం ఉంది కానీ తన పద్ధతిని మార్చు కోవడం లేదని విమర్శించారు. ప్రజలు సొంత ఖర్చుతో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అతికష్టం మీద వ్యాక్సిన్లు వేయించుకుంటే ప్రధాని ఫోటోతో ఎందుకు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నారని పొన్నం ప్రశ్నించారు. ఎలాంటి శ్రమ లేకుండా ప్రధాని ఫోటోతో సర్టిఫికెట్ ఇస్తే అవమానం అనిపిస్తుందని ఎద్దేవా చేసారు.

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని పొన్నం ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతంలో మాదిరిగా అనేకమైన టీకాలు, వ్యాక్సిన్లు ఏవిధంగానైతే పోలియో కేంద్రాల్లో పెట్టి వేయించే పద్ధతి ఉందో ఆ విధంగా ప్రతి దగ్గర కరోనా వ్యాక్సిన్ వేయించుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కు సంబంధించి దేశం నేడు ఎంత వైఫల్యం అయిందో, దేశ ఆరోగ్య పరిస్థితుల పట్ల ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయో ప్రధాని తనకు తాను ఆలోచన చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version