అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎందరో అత్యుత్తమ ఆటగాళ్లను అతను ఎదుర్కొన్నాడు. బౌలర్ ఎవరు అయినా సరే పరుగుల వరద పారించడమే లక్ష్యంగా అతను తన కెరీర్ లో దూసుకుపోయాడు. అయితే మన స్పిన్నర్ హర్భజన్ సింగ్ ని ఎదుర్కోవడంలో మాత్రం అతను బాగా తడబడ్డాడు. చాలా సార్లు భజ్జీ బౌలింగ్ లో ఆడలేక అవుట్ అయ్యాడు.
ఇదే విషయాన్ని తాజాగా భజ్జీ రోహిత్ శర్మతో లైవ్ చాట్ లో వివరించాడు. తన ముఖం చూస్తేనే రికీ పాంటింగ్ ఔటయ్యేవాడని అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. అతడికి నేను బౌలింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదన్నాడు. అయితే, ఐపీఎల్‌లో పాంటింగ్ ముంబయి ఇండియన్స్‌కు ఆడటానికి వచ్చినప్పుడు మాత్రం, నెట్స్‌లో నా బౌలింగ్‌పై సాధన చేసి మెరుగవుతాడని అనుకున్నా కాని…
అదీ జరగలేదన్నాడు బజ్జీ. అక్కడ కూడా అతడిని 5-6 సార్లు ఔట్‌చేశా అని వివరించాడు. దీనిపై స్పందించిన రోహిత్… ఆ టోర్నీ ప్రారంభానికి ముందే నువ్వు పాంటింగ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఉండొచ్చని అనుకుంటున్నా అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వివాదాస్పద కెప్టెన్ గా తన జట్టు కోసం ఏదైనా చేసే ఆటగాడిగా అతను చరిత్రలో నిలిచిపోయాడు. ఆసిస్ జట్టుని విశ్వ విజేతగా నిలిపాడు.