ప్రశాంత్ కిషోర్” దేశంలో రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న అందరికి ఈ పేరు సుపరిచతమే. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ఏకంగా నరేంద్ర మోడిని ప్రధానిని చేసిన ఘనత ప్రశాంత్ కిషోర్ సొంతం అనేది వాస్తవం. ఎన్నో రాజకీయ పార్టీలు ఆయన వ్యూహాలతోనే ఘన విజయాలు సాధించాయి. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి ఓట్లు ఏ విధంగా రాబట్టాలి అనేది ఆయనకు తెలిసిన రేంజ్ లో ఎవరికి తెలియదు అనేది వాస్తవం.
జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ ఫార్ములాలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే అది ప్రశాంత్ కిషోర్ చలువే. ఆయన వలనే జగన్ తన చిరకాల స్వప్నం నెరవేర్చుకున్నారు. ఇక ఆయన సొంత రాష్ట్రం బీహార్ కాబట్టి అక్కడ అధికారంలో ఉన్న జనతా దళ్ యునైటెడ్ ఆయనను పార్టీలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పార్టీలో ప్రశాంత్ ని నెంబర్ 2 చేసారు.
అయితే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి దూరం జరుగుతూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసారు ఆయన. దీనితో ఆయన్ను నితీష్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఈ నేపధ్యంలో ప్రశాంత్ మరో పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఆయన కర్ణాటక జేడీఎస్‌లో చేరనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి త్వరలోనే ప్రశాంత్‌తో చర్చలు జరుపన్నుట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అనేది స్పష్టత రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకోవాలని 2018 కర్ణాటక ఎన్నికల సందర్భంలో జెడిఎస్ భావించినా కుమారస్వామి అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన బిజెపికి దూరం జరగడంతో ఆ పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి.