ప్రస్తుతం జనరేషన్ లో పెళ్లిని ఓ ఉత్సవంగా చేసుకుంటున్నారు. పెళ్లిళ్లకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు, సంగీత్, బ్యాచ్ లర్ పార్టీలు అంటూ ఇలా విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. తమ పెళ్లి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగలాలని వధూవరులు కోరకుంటున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనకాడటం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లకు భలే గిరాకీ ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఇవే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్లకు వెళ్లి ప్రమాదవశాత్తు వధూవరులు మరణించిన ఘటనలు చూశాం. నూరేళ్ల పాటు తమ పెళ్లి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనుకన్న వారి కలలు ప్రీ వెడ్డింగ్ షూట్ల కారణంగా అర్థాంతరంగా ముగుస్తున్నాయి.
తాజాగా ఇలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లా కోహెడలో జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వధువు, వరుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎల్లుండి పెళ్లి ఉండటంతో ఇరు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. పెళ్లికి ముందు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం… వధూవరుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.