దేశవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా వల్ల ఎంతో మంది చనిపోయిన నేపథ్యంలో మోదీ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కరోనా వ్యాక్సిన్‌ను ముందుగా ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లకే ఇవ్వాలని, ప్రజా ప్రతినిధులు, నేతలు వ్యాక్సిన్ కోసం పైరవీలు చేయవద్దని, వ్యాక్సిన్ పంపిణీకి సహకరించాలని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ విషయమై హెచ్చరికలు కూడా చేశారు.
అయితే మోదీ హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెనక్కి తగ్గారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు పెంచుకోవద్దని, వ్యాక్సిన్ తీసుకునే వారికి నమ్మకం కలిగించేందుకు తాను మొదటి డోసు తీసుకుంటానని మంత్రి ఈటల గతంలో తెలిపారు. అయితే మోదీ హెచ్చరించిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ఇతర నేతలకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహాయం అందించాలని సూచించారని మంత్రి ఈటల అన్నారు. కేంద్రం మరిన్ని డోసులను పంపిస్తే ప్రైవేటు హాస్పిటళ్ల సిబ్బందికి కూడా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. అయితే ప్రధాని మోదీతో జరిగిన సీఎంల మీటింగ్‌లో మోదీ సీఎంలకు వ్యాక్సిన్ పంపిణీపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నేతలు క్యూలో జంప్ కాకుండా పంపిణీకి సహకరించాలని సూచించినట్లు సమాచారం. అందుకనే మంత్రి ఈటల వ్యాక్సిన్ తీసుకోలేదని స్పష్టమవుతుంది.