కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్‌లు మూత పడిన సంగతి తెలిసిందే. అయితే ఇన్‌పేషెంట్లకు, ఎమర్జెన్సీ ఉన్నవారికి మాత్రమే పలు హాస్పిటళ్లలో సేవలను అందిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తుండడంతో ఇక ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోంలను కూడా తెరవనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు సూచనలు చేసింది.
ప్రైవేటు హాస్పిటళ్లు, ల్యాబ్‌లు మూతపడి ఉండడం వల్ల పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సేవలను పౌరులు అందుకోలేకపోతున్నారని.. దీనికి తోడు గర్భిణీలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందువల్ల ప్రైవేటు క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, హాస్పిటల్స్, ల్యాబ్‌లను ఓపెన్ చేయాలని సూచించింది. కరోనా సేఫ్టీ నిబంధనలను పాటిస్తూ.. ఆయా సేవలను తిరిగి ప్రారంభించాలని.. సూచనలు జారీ చేసింది.
ఇక హాస్పిటల్ సేవలు అవసరం ఉన్న వారికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. అన్ని ప్రైవేటు క్లినిక్స్, హాస్పిటల్స్, ల్యాబ్స్‌ను మళ్లీ ఓపెన్ చేయాలని అన్నారు.