ప్రియా ఆనంద్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు..! రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘లీడర్'( 2010) చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు తర్వాత రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’, సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన ‘180’ , శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
అందం, అభినయం కలిగిన ఈ నటి..తమిళంలో బిజీ అవ్వడంతో పదేళ్ళ పాటు టాలీవుడ్ కు దూరమైంది. తెలుగులో ఈమెకు మంచి క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈమె ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.వారి నిరీక్షణ ఫలించింది. మొత్తానికి ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్ తో ప్రియా ఆనంద్ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
‘వరుడు కావలెను’ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా ఆనంద్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. పల్లెటూరి అమ్మాయి గా ఆమె లుక్ చాలా నాచురల్ గా, తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సిరీస్ జూలై 15 నుండి ‘జీ5’ లో స్ట్రీమింగ్ కానుంది.