ఇద్దరు నేతల మధ్య పంచాయితీ… బిక్కవోలు ఆలయం మెట్లు ఎక్కే వరకూ వెళ్లింది. అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వినాయకుడి ముందు ప్రమాణం చేశారు. ఐనా వీరి మధ్య యుద్ధం ఆగలేదు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలను ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.
అనపర్తిలో వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ నేత నల్లమల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. ఇద్దరు నేతలు బిక్కవోలు వినాయకుడి గుడిలో సత్యప్రమాణం చేశారు. ముందుగా చెప్పిన సమయం ప్రకారమే… ఆలయంలోకి సతీసమేతంగా చేరుకున్నారు నేతలు. సత్యప్రమాణం సమయంలో ఇద్దరు గొడవపడ్డారు. 18నెలల్లో ఒక్క రుపాయి అవినీతికి పాల్పడలేదని సతీసమేతంగా ప్రమాణం చేశారు సూర్యనారాయణరెడ్డి. తర్వాత మాజీ ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి దంపతులు ప్రమాణం చేయకుండా ఆరోపణలు చేయడంతో… సూర్యనారాయణరెడ్డి అడ్డుపడ్డారు.
ఆరోపణలు కాదు సత్యప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. ఎమ్మెల్యే దంపతులు ప్రమాణం చేసి వెళ్ళిపోగానే, మాజీ ఎమ్మెల్యే దంపతులు ప్రమాణం చేశారు. ప్రమాణం తర్వాత కూడా నేతల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. రామకృష్ణారెడ్డి సవాల్ చేసి పారిపోయారన్నారు అనపర్తి ఎమ్మెల్యే. ఆయన భార్య ఆలయంలో ప్రమాణం చేయలేదని ఆరోపించారు.
సూర్యనారాయణరెడ్డి ఆరోపణలను కొట్టిపారేశారు రామకృష్ణారెడ్డి. తనతో పాటు తన భార్య కూడా ప్రమాణం చేసిందన్నారు. బహిరంగ చర్చకు రావాలనీ…అనపర్తిలో అవినీతి కార్యకలాపాలు ఆగనంత వరకూ ఆరోపణలు చేస్తూనే ఉంటాననీ తేల్చి చెప్పారు. ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న ఎమ్మెల్యే … కేంద్రసంస్థతో దర్యాప్తుకు వెళ్లాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హాయంలో జరిగిన అవినీతిపైన సిబిఐ దర్యాప్తు కోరుతున్నారు. ఐతే సీబీఐ దర్యాప్తుపై కూడా నేతలు సవాల్ విసురుకున్నారు.