తెలంగాణ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన నల్లబంగారు నేలలు.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా సరికొత్త చరిత్రను సొంతం చేసుకున్నాయి. ఇంకో శతాబ్దపు ప్రయాణానికి కొంగొత్త ఆశలతో అడుగులు వేస్తోంది సింగరేణి కాలరీస్. చీకటి పొరల్ని చీల్చి దేశానికి వెలుగులిచ్చే దివ్వెగా మారిన సంస్థ సింగరేణి. భూగర్భంతోపాటు ఓపెన్‌కాస్ట్ గనుల్లో అపార బోగ్గు నిక్షేపాలను వెలికి తీస్తూ దేశ పురోభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషించింది.
తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన ప్రాంతం సింగరేణి. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్, ఖమ్మం, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో నిత్యం లక్షల టన్నుల నల్లబంగారాన్ని వెలికి తీస్తుంటారు కార్మికులు. వేలమంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తోంది సింగరేణి కాలరీస్. 1886లోనే బ్రిటిష్ ఇండియా సమయంలో డెక్కన్ కంపెనీ లిమిటెడ్ ఇల్లెందులో బొగ్గు వెలికితీత కోసం అనుమతి పొందినా.. 1889లో పనులు ప్రారంభమయ్యాయి. చివరకు 1920లో డిసెంబర్ 23న ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCLగా మారి దిన దిన ప్రవర్థమానం అవుతోంది. ఇప్పుడు వందేళ్ల పండగ చేసుకుంటోంది.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పొయ్యిలు మండించడానికి రాళ్లను వాడటాన్ని బ్రిటిషర్లు గుర్తించి.. ఇక్కడ అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బొగ్గు వెలికి తీత ఆగలేదనే చెప్పాలి. మొదట్లో భూగర్భ గనుల నుంచి బొగ్గును తీసేవారు. 80వ దశకంలో ఓపెన్ కాస్ట్ గనులు మొదలయ్యాయి. ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా సింగరేణి కాలరీస్ సంస్థ భారీగా లాభాలను ఆర్జించింది. క్రమంగా వాటినే విస్తరించుకుంటూ పోయింది.
సింగరేణి కాలరీస్ ప్రస్థానంలో విజయగాధలే కాదు.. మరకలు.. మలుపులు కూడా ఎన్నో ఉన్నాయి. సింగరేణి చరిత్రలో 1938లో ఇల్లెందులో జరిగిన ఘోర ప్రమాదం చాలా పెద్దది. ఆ ఏడాది మార్చి 12న మొహర్రం రోజున గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు బ్రిటిష్ అధికారులతోపాటు వందల మంది కార్మికులు చనిపోయారు. ఈ ప్రమాదం తర్వాత సింగరేణిని విస్తరించాలనే ఆలోచన చేశారు బ్రిటిషర్లు. ఆ విధంగా ఖమ్మం నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు నల్లబంగారు నేలల్లో సిరులు పండిస్తోంది సింగరేణి.
సింగరేణి సంస్థను 1990 దశకం చాలా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. సంస్థ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ సమయంలో సంస్థను మూసివేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. సమస్య నాటి సీఎం చంద్రబాబు దగ్గరకు రావడంతో.. నష్టాలు వస్తే ఎవ్వరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు. దాంతో లాభాలు తెస్తే వాటా ఇస్తారా అని కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. దాంతో లాభాలు తీసుకొస్తే అలాగే చేద్దామని చంద్రబాబు చెప్పడంతో .. దానికి ఒక సవాల్‌గా తీసుకుని పనిచేశారు కార్మికులు. తమ మొక్కవోని పట్టుదలతో సింగరేణిని మళ్లీ లాభాల బాట పట్టించి నిలబెట్టారు.
సింగరేణిలో ప్రస్తుతం తెలంగాణ వాటా 51 శాతమైతే మిగతా వాటా కేంద్ర ప్రభుత్వానిది. ఏటా 70 మిలియన్ టన్నులకుపైగా బొగ్గును వెలికి తీస్తున్నారు. ఈ లక్ష్యానికి ఏటికేడు పెంచుకుంటూ వెళ్తున్నారు. సింగరేణి పరిధిలో దాదాపు 22వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అంచనా. మరో వందేళ్ల వరక మానవ అవసరాలకు సరిపడా బొగ్గు ఇక్కడి నేలల్లో నిక్షిప్తమై ఉంది. ఆరు రాష్ట్రాల్లోని వివిధ కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తుంది కూడా ఈ సంస్థే. దాదాపు 27 అండర్‌గ్రౌండ్.. 18 ఓపెన్ కాస్ట్ గనులు నుంచి బొగ్గు వెలికితీత జరుగుతోంది.
రానున్న కాలంలో మరో 14 ఓపెన్ కాస్ట్.. 8 భూగర్భ గనులను ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. అయితే ఖాళీలను భర్తీ చేసే పరిస్థితి లేదు. యంత్రాలను తీసుకొచ్చి.. తక్కువ ఖర్చు.. ఎక్కువ ఉత్పత్తి పైనే సింగరేణి యాజమాన్యం కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు ఏ రీతిగా మారతాయో అంచనా వేయలేని పరిస్థితి.