కరోనా మహమ్మారి.. కోరలు చాచి విజృంభిస్తోంది. మనకు తెలియకుండానే మనలోకి ప్రవేశించి మన శరీరమంతటా వ్యాపిస్తోంది. మనం ఆ విషయాన్ని తెలుసుకునే లోపే కొందరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో ఎంతో విలువైన ప్రాణాలను కోల్పోతున్నాం. కరోనా మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. ఉన్న మందులతోనే మనం ఆ వ్యాధి నుంచి బయట పడాలి. మనకు కరోనా వస్తే.. డబ్బులుంటే ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్తాం. కానీ వారు కరోనా పేరు చెప్పి లక్షలకు లక్షల రూపాయలు మన నుంచి పిండుకుంటున్నారు. ఇక ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనాకు ఉచితంగానే చికిత్స ఇస్తున్నారు. కానీ అనేక చోట్ల బెడ్లు సరిపోవడం లేదు. అందుకని అంతటి అవస్థ పడకుండా ముందుగానే మనం కరోనా నుంచి జాగ్రత్తగా ఉందాం.
కరోనా మహమ్మారి వస్తే కొందరికి దాని లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో వారు హాస్పిటళ్లకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. కానీ లక్షణాలు కనిపించని వారి వల్లే ఇప్పుడు ప్రమాదం ముంచుకొస్తోంది. అలాంటి వారు ఎంత మంది ఉన్నారో తెలియదు. నిజానికి ఈ విషయంలో వారిని కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే లక్షణాలు కనిపించవు కనుక.. కరోనా వారికి వచ్చినట్లు కూడా తెలియదు. కొందరికి కరోనా వచ్చినా టెస్టులు చేసే దాకా అది బయట పడడం లేదు. లక్షణాలు కనిపించకపోవడం వల్ల కొందరు తమకు కరోనా లేదని అనుకుంటున్నారు. కానీ వారి వల్ల ఇతరులకు కూడా ఆ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
కనుక కరోనా వచ్చిన వారు.. రాని వారు.. లక్షణాలు ఉన్నవారు.. లేని వారు.. ఎవరైనా సరే.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులను ధరించండి. శానిటైజర్లను వాడండి. ఇంట్లో హ్యాండ్ వాష్‌తో చేతులను శుభ్రం చేసుకోండి. బయట తిరిగి వస్తే స్నానం చేశాకే ఇంట్లోని వారితో కాంటాక్ట్ అవండి. భౌతిక దూరం పాటించండి. కరోనా వచ్చాక దిగులు పడడం కన్నా.. అది రాకముందే మనల్ని మనం దాని నుంచి రక్షించుకోవాలి. స్వీయ రక్షణే అన్నింటికన్నా ఉత్తమమైంది. మనల్ని ఎవరో వస్తారని.. ఆదుకుంటారని అనుకోవద్దు.. మనల్ని మనమే రక్షించుకోవాలి. కరోనా రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.. బీ సేఫ్.. బీ హెల్తీ.. గెటవుట్ కరోనా..!