కరోనా లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఏ స్థాయిలో బాధితులకు సహాయం అందించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలోనూ అతను కోవిడ్ బాధితులకు, ఇతరులకు సహాయం చేస్తున్నాడు. అయితే కోవిడ్ వల్ల చనిపోయిన వారి మృతదేహాలకు ఉచితంగా అంత్యక్రియలను నిర్వహించాలని సోనూసూద్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు.
ఓ రోజు రాత్రి 2 గంటలకు ఓ కోవిడ్ పేషెంట్‌కు బెడ్ కావాలని కాల్ వచ్చింది. వెంటనే బెడ్ కోసం యత్నించాం. చాలా సేపటి తరువాత బెడ్ అందజేయగలిగాం. అతను వెంటిలేటర్‌పై చాలా సేపు పోరాడాడు. కానీ చివరకు తెల్ల వారు జామున 6.30 గంటలకు చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు అతని మృతదేహానికి అంత్య క్రియలు కూడా నిర్వహించలేకపోయారు. కారణం, వారి వద్ద డబ్బు లేదు. చివరకు వారికి సహాయం చేశా. ఇలాంటి వారు చాలా మంది ఉంటున్నారు. దయ చేసి వారి వద్ద డబ్బులు తీసుకోకండి. ఉచితంగా అంత్యక్రియలు అయినా నిర్వహించేలా ఏర్పాట్లు చేయండి. దీంతో ఆత్మీయులను కోల్పోయిన వారు మరణించిన వారికి అంతిమ సంస్కారాలను అయినా సంతృప్తితో నిర్వహించగలుగుతారు.. అని సోనూ సూద్ తెలిపాడు. సోనూ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు.
కాగా సోనూసూద్ ఇటీవలే కాలేజీలకు ఓ విజ్ఞప్తి చేశాడు. చాలా మంది విద్యార్థులు కోవిడ్ వల్ల కన్నవారిని చనిపోయారని, వారికి ఉచితంగా విద్యను అందించాలని కాలేజీలను కోరాడు. ఇప్పుడు తాజాగా పై విధంగా స్పందించాడు. అంత్యక్రియలను అయినా ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరాడు. ఇటీవల సోసూసూద్ తనకు కోవిడ్ బాధితులు చేస్తున్న కాల్స్, పెడుతున్న మెసేజ్‌లపై కూడా స్పందించాడు. తనను సంప్రదించిన అందరికీ సహాయం అందిస్తానని, అప్పటి వరకు దయ చేసి వేచి చూడాలని, బాధితులు ఎక్కువ మంది ఉన్నందున సహాయం అందించేందుకు ఆలస్యం అవుతుందని, అందుకు చింతిస్తున్నామని అన్నాడు.