కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన మరో 118 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యాప్స్ లో పబ్‌జి మొబైల్ గేమ్ యాప్ కూడా ఉంది. ఈ క్రమంలో ఆ యాప్‌ను నిషేధించడంతో దాని పబ్లిషింగ్ కంపెనీ టెన్సెంట్ గేమ్స్ భారీగా నష్టపోయింది. పబ్‌జి నిషేధంతో టెన్సెంట్ గేమ్స్ కంపెనీ దాదాపుగా 14 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూను నష్టపోయింది. అలాగే గురువారం ఆ కంపెనీకి చెందిన షేర్లు 2 శాతం పడిపోయాయి.
నిజానికి పబ్‌జి మొబైల్ గేమ్‌కు భారతదేశ మార్కెటే పెద్దది. ఈ గేమ్‌ను మన దేశంలో మొత్తం 17.5 కోట్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. దీన్ని డెవలప్ చేసింది దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ కంపెనీ. కాకపోతే ఈ గేమ్‌ను మొబైల్ వెర్షన్‌లో తెచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ సహకరించింది. దీంతో టెన్సెంట్ గేమ్స్‌కు బ్లూహోల్ కంపెనీ 10 శాతం వాటా ఇచ్చింది. అదే ఇప్పుడు బ్లూ హోల్ కొంప ముంచింది.
కాగా టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఆసియాలో అత్యధిక సక్సెస్ రేట్ సాధించిన కంపెనీగా అవతరించింది. 2018లో ఈ కంపెనీ మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే తాజాగా పబ్‌జి గేమ్‌ను ఇండియాలో బ్యాన్ చేయడంతో ఈ సంస్థ ప్రస్తుతం నష్టాలను చవిచూస్తోంది.