రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల వ్యవహార శైలిపై ప్రజలు వెనువెంటనే స్పందిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి రావడం తో ప్రజలు తమ అభిప్రాయాలను వెనువెంటనే కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. గతానికి భిన్నంగా ఇప్పుడు వెను వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీలు వ్యవహరించిన తీరుపై ప్రజలు ఒకింత ఆగ్రహంతో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఈ పార్టీలు ఇక మారవా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపించాయి. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా అటు ప్రధాన ప్రతిపక్షం కానీ, ఇటు అధికార పక్షం కానీ.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఏ విషయంపైనా చర్చ సంపూర్ణంగా సాగకపోగా.. ప్రజాధనం కోట్లలో వృథా అయిందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు కీలక సమస్యలు ఉన్నాయి. ఒకటి ఉల్లి పాయలు కాగా, రెండు నిత్యావసర వస్తువుల ధరలు వీటితోపాటు మహిళలకు రక్షణ. ఈ విషయాల్లో టీడీపీ కానీ, వైసీపీ కానీ నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదని తొలి రోజు సభను చూస్తేనే అర్ధమైందనేది పబ్లిక్ టాక్.
నువ్వు పోకచెక్కతో ఒకమాటంటే.. నేను తలుపు చెక్కతో రెండు మాటలంటాను!! అనే ధోరణిలోనే ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షాలు వ్యవహరించడం ఏమేరకు సరైందని వారు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చంద్రబాబు అండ్ టీం ఎంత సఫలం కాలేక పోతున్నారో.. వ్యక్తిగత విషయాల ప్రస్థావనలో అధికారపక్షం కూడా అలానే వ్యవహరిస్తోందన్నది సోషల్ మీడియాలో ప్రజలు చేస్తున్న ఆగ్రహం. విషయం ఏదైనా ప్రజలకు మేలు చేసేలా ఉండాలే తప్ప.. సాగదీతలు, అరుపులు, కేకలు, నిరసనలు, ఆధిపత్య ధోరణులు ఇంకెంత కాలం కొనసాగిస్తారనేది ప్రజల ప్రశ్న.
మీ కాలంలో ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్న వైసీపీ కానీ, ఇప్పుడు ఏదో జరిగిపోతోంది. గతంలో మేం ఇలా చేయలేదు.. అంటున్న టీడీపీ కానీ, ప్రస్తుత సమస్యలపై సానుకూల చర్చలకు తావివ్వకుండా వ్యక్తిగత విమర్శలకు తావివ్వడాన్ని సహించలేక పోతున్నారు. గత పాలన బాగోలేకే ప్రస్తుతంప్రభుత్వాన్ని మార్చారనే స్పృహను వైసీపీ, తమ పాలనలో జరిగిన తప్పులు తమను ప్రతిపక్షంలోకి నెట్టాయన్న ఆలోచన టీడీపీ చేయాలనేది ప్రజలు సూచిస్తున్న ప్రధాన అంశం.
కానీ, ఈ రెండు పార్టీలు ఆధిపత్య రాజకీయాలకోసమే సభలకు వస్తున్నాయనే వాదనన బలంగా వినిపిస్తోంది. గతంలోనూ ఉల్లి సమస్య ఉంది. ఇప్పుడూ ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అదేసమయం లో మహిళలపై అకృత్యాలు ఇప్పుడు కొత్తకాదు. ఇకపై జరగబోవని ఎవరూ చెప్పలేరు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలపై శాశ్వత ప్రాతిపదికన చర్చించి పరిష్కారాలను చూపించాల్సిన అసెంబ్లీని తన్నుకోడానికి, మాటల తూటాలు పేల్చుకుని ముసిముసి నవ్వులతో సరిపెట్టడానికి వేదికగా చేసుకోవడం ఏమేరకు సమంజసమో ఆలోచించుకోవాలనేది పబ్లిక్ టాక్. మరి ఈ రెండు పార్టీలూ ప్రజల మాటలను వింటాయా? లేదా? చూడాలి.