నేటి నుంచి పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సోకిన ఎమ్మెల్యేలు, మంత్రులతో సమీపంగా మెలిగిన ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ సమావేశాలకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. కాగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేయనున్నారు. దీనికోసం విధాన సభ పరిసరాల్లో ట్రూనాట్, ఆర్ఏటీ మెషిన్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల వసతిగృహాల్లో కూడా ఈ మిషిన్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు 48 గంటల ముందు కరోనా నెగిటివ్‌గా నిర్థారణ అయిన ఎమ్మెల్యేలకు మాత్రమే అసెంబ్లీలోకి ప్రవేశం కల్పించనున్నారు. ఇటీవల ధర్నాలు నిర్వహించిన ఆప్ ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని సీఎం చెప్పారు. అప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రాగా, ధర్నాలో పాల్గొన్న వారి ద్వారా మరో ఇద్దరు ఎమ్యెల్యేలకు కరోనా వచ్చిందని, అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ధర్నాలు వంటి కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని సూచించారు.