కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో నిన్న భారీ పేకాట స్థావరంపై ప్రత్యేక పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుమారు 5 లక్షల నగదు, 42 వాహనాలు స్వాధీనం చేసుకొని 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి స్వగ్రామం కావడం మంత్రి జయ రామ్ కు వరుసకు సోదరుడయ్యే నారాయణ అనే వ్యక్తి ఈ స్థావరాన్ని నిర్వహిస్తుండడంతో మంత్రి మీద కూడ ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఆయన స్పందించారు.
ఈ పేకాట వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని మంత్రి ప్రకటించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనన్న ఆయన నేను, నా సోదరులు ఆలూరులోనే ఉంటామని అన్నారు. గుమ్మనూరు మా స్వగ్రామమే, కాని మా కుటుంబ సభ్యులం అంతా ఉండేది ఆలూరులో అని ఆయన చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగినా సహించబోమని తప్పు ఎవరు చేసినా ఉపేక్షించవద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించామని అన్నారు. ఈవిషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.