బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించారు. బోయినపల్లిలో చేనేత మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, సుపరిపాలన అంటూ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నారని, సుపరిపాలన ఎక్కడుందో ప్రజలే గుర్తించాలని అన్నారు. చేనేతలపై మోయలేని భారం వేసి ఇబ్బందిపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని పురందేశ్వరి స్పష్టం చేశారు. రాజంపేటలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసినట్టు చెప్పారు. కానీ, కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. పీలేరు-తిరుపతి-కడప రోడ్డుకు కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు.
కడప-బెంగళూరు రైల్వే లైన్ వద్దని జగన్ కేంద్రానికి లేఖ రాశారని పురందేశ్వరి వెల్లడించారు. అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆమె విమర్శించారు. కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు గేటును పూర్తిచేయలేదని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇళ్లు నిర్మించలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువత ఇబ్బందిపడుతోందని తెలిపారు. ఇక, మద్యం మాఫియాపై సీబీఐ సరైన సమయంలో స్పందిస్తుందని భావిస్తున్నట్టు పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.