ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఆ రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. నిధిని తరలించేందుకు 6 భారీ పెట్టేలు ఏర్పాటు చేశారు.
రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియంతా డిజిటలైజేషన్ చేయనున్నారు.
ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా? తదితర వివరాలపై స్పష్టత రాలేదు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరీ రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు స్నేక్ హెలెన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లినట్లు సమాచారం.