ప్రయాణికులకు శుభవార్త. ఐదు నెలల తర్వాత.. కాజీపేట-డోర్నకల్-విజయవాడ మధ్య నడిచే పుష్‌పుల్ రైలు పట్టాలెక్కింది. వివిధ చోట్ల ట్రాక్ మరమ్మతుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఈ రైలును ఐదు నెలల క్రితం రద్దు చేసిన విషయం తెలిసిందే. దశల వారీగా రద్దు నిర్ణయాన్ని పొడిగించుకుంటూ రావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుష్‌పుల్ రైలు లేక సామాన్య ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈ రైల్వే లైన్‌ను పునరుద్ధరించాలని గతంలో డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇతర ఉన్నతాధికారులకు వివిధ వర్గాల ప్రజలు వినతి పత్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. మరోవైపు గార్లలోనైతే ప్రత్యక్ష నిరసన వ్యక్తం చేసి అక్కడి ప్రయాణికులు రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టకేలకు రైల్వే అధికారులు రంగంలోకి దిగి ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. ఇలా.. దాదాపు అయిదు నెలల విరామం తర్వాత పుష్‌పుల్ రైలు పరుగు తీయడం ప్రారంభించింది. ఎట్టకేలకు రైలు పునరుద్ధరణతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్పుల్ రైలు.. ప్రతి రోజు ఉదయం 6:40 గంటలకు కాజీపేట నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.