సుదీర్ఘమైన ఉద్యోగంలో అనేక హోదాలు అనుభవించారు. రిటైరయ్యారు. అయినప్పటికీ.. పనితీరు ఆధారంగా తర్వాత కూడా ప్రభుత్వాలు వారి సేవలను వినియోగించుకున్నాయి. కానీ, వీరు కొరకరాని కొయ్యలుగా మారుతున్నారు. ప్రభుత్వాల కంట్లో నలుసుల్లా మారుతున్నారు. వారే మాజీ ఐఏఎస్‌లు! ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పీవీ రమేష్.. గత చంద్రబాబు హయాంలో ఐవైఆర్ కృష్ణారావులు పిల్ల చేష్ఠలతో తమ పరువు పోగొట్టుకున్నారు.. దీనికి ముందు అపఖ్యాతి పాలయ్యారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఐవైఆర్ కృష్ణారావు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన ఆశలు నెరవేరకముందుగానే రాష్ట్ర విభజన జరిగిపోయింది. దీంతో తర్వాత ఏర్పడిన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి సీఎం చంద్రబాబు ఏరికోరి ఐవైఆర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆయన తర్వాత కాలంలో రిటైర్ అయ్యారు. అయినప్పటికీ.. ఆయన సేవలు కావాలనుకుని.. ఆయనను నేరుగా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తొలి చైర్మన్ చేశారు. ఆయన చెప్పినట్టు చంద్రబాబు నిదులు కూడా ఇచ్చారు.
అయితే, తర్వాత కాలంలో చైర్మన్ గా ఉంటూనే ఐవైఆర్.. బాబు సర్కారుపై ఫేస్‌బుక్ వేదికగా విమర్శలు గుప్పించారు. బాబు వ్యాఖ్యలపై దుమారం రేపారు. ఇదితీవ్ర వివాదం కావడంతో ఆయనను అంతే వివాదాస్పద రీతిలో పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆల్రెడీ రిటైర్ అయిన ఐఏఎస్ పీవీ రమేష్‌ను తన సలహాదారుగా వేసుకున్నారు జగన్. అయితే, కొన్ని కారణాల వల్ల కొన్ని శాఖలను ఆయన నుంచి తప్పించారు. దీంతో అలిగిన పీవీ రమేష్ ఇప్పుడు ప్రభుత్వంపై కత్తి దూస్తున్నారు. ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను రెచ్చగొడుతున్నారు.
ప్రభుత్వ పెద్దలకు సేవకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవకులుగా కాకుండా.. అంటూ.. పీవీ రమేష్ ట్వీట్ చేశారు. ఎంతైనా.. తనను సలహాదారుగా దాదాపుఏడాది పాటు కొనసాగించారన్న విశ్వాసం కూడా లేకుండా.. కేవలం పదవి వ్యామోహంతోనే ఇలా చేశారనే ప్రతి విమర్శలై వైఎస్సార్ సీపీ నుంచి వస్తున్నాయి. ఇంత బతుకు బతికి.. చివరికి వివాదాస్పద రీతిలో పీవీ రమేష్ కూడా తప్పుకొనే పరిస్థితి తెచ్చుకున్నారు. పిలిచి పిల్లనిచ్చారనే విశ్వాసం అటు ఐవైఆర్‌లోను, ఇటు పీవీలోనే కనిపించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.