విదేశీ కార్మికులకు ఖతర్ ప్రభుత్వం షాకిచ్చింది. ఖతర్ రాజధాని దోహాలో ఉన్న విదేశీ కార్మికులను ఉన్నపళంగా ఖాళీ చేయిస్తోంది అక్కడి ప్రభుత్వం. అర్ధరాత్రి అని కూడా చూడకుండా, సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా ఖాళీ చేసి వెళ్లిపోమంటోంది. దీనికి కారణం ఫుట్ బాల్ ప్రపంచకప్. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫుట్ బాల్ ప్రపంచకప్ కు ఖతార్ ఆథిత్యం ఇస్తోంది. వచ్చే నెల 20 నుంచి ప్రపంచ కప్ జరగనుంది. ఈ మ్యాచ్ లను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి సాకర్ అభిమానులు తరలి వస్తున్నారు.
లక్షలాది మంది అభిమానులు తరలి వస్తుండటంతో వీరికి అకామడేషన్ కల్పించడం సమస్యగా మారింది. దీంతో, దోహాలో ఉన్న విదేశీ కార్మికులను ఖాళీ చేయిస్తోంది ఖతర్ సర్కార్. కేవలం రెండు గంటల ముందు నోటీసులు ఇచ్చి వెళ్లిపోమంటోంది ఖతర్ సర్కార్. ఖతార్ జనాభా 30 లక్షలు కాగా… వీరిలో 85 శాతం మంది విదేశీ కార్మికులే. వీరిలో ఎక్కువ మంది దినసరి కార్మికులుగా, డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశీ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు.