ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు ఎంపీ రఘురామరాజు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లక్షలాది మందితో కలిసి నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్రకు లేని ఆంక్షలు అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకని ప్రశ్నించారు. 29 వేల మంది రైతు కుటుంబాలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి మోసపోయారని.. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సామూహికంగా దైవదర్శనానికి వెళ్లే అవకాశం కూడా లేదా అన్నారు రఘురామరాజు. అమరావతి రైతులకు రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థ కూడా.. ఓ వ్యవస్థేనా మండిపడ్డారు రఘురామరాజు. అమరావతి రైతులకు రక్షణ కల్పించడానికి అవస్థ పడుతున్న న్యాయ వ్యవస్థ ఒకవైపు, అన్యాయం చేయాలని చూస్తున్న శాసన వ్యవస్థ మరొక వైపు అన్నారు రఘురామరాజు.
ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయాన్ని సాధించుకుందామని అమరావతి రైతులకు రఘురామరాజు సూచించారు. మంత్రులు నోటికొచ్చినట్లు బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని రఘురామరాజు ధ్వజమెత్తారు. విశాఖను రాజధానిగా ఎవరు అడ్డుకోలేరన్న మంత్రుల వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు లేవన్నారు రఘురామరాజు. గతంలో ఇదే న్యాయమూర్తి, జస్టిస్ ఎన్ వీ రమణ కంటెంట్ కేసును గతంలో జగన్ తరఫున వాదించానని చెప్పి స్వీకరించలేదని గుర్తు చేశారు రఘురామరాజు.