ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు నేడు ఒకే వేదికను పంచుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో వీరు పాల్గొంటారు. అనంతరం ఇద్దరు నేతలు హెలికాప్టర్‌లో హైదరాబాద్ చేరుకుని… అమీర్‌పేట, నాంపల్లి సభల్లో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు బహిరంగ సభలతో పాటు బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపారాధన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. గురువారం కూడా చంద్రబాబు హైదరాబాద్‌లో తెదేపా అభ్యర్ధుల తరుపున ప్రచారం చేస్తూ..వారికి పలు సూచలు చేస్తారన తెలంగాణ తెదేపా అధ్యక్షులు రమణ తెలిపారు. గురువారం రాహుల్ గాంధీ భూపాలపల్లి, ఆర్మూర్, పరిగి, చేవెళ్ళ సభలకు హాజరవుతారు. తుది విడతగా డిసెంబర్3న రాహుల్ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి కుంతియా వివరించారు.
ఈ ఇద్దరి నేతలతో పాటు భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సైతం నేడు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణలో నేడు, రేపు కీలక నేతల పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.