ఆదివాసీలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి దారుణం : రాహుల్‌ గాంధీ

-

మరోసారి ట్విట్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌పై ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. మంచిర్యాల జిల్లాలో పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీలు పోరాడుతుండగా, అటవీ భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ అధికారులు ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తొలగించే క్రమంలో ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే.. ఆరుగురు ఆదివాసీ మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళలని కూడా చూడకుండా వారిని లాగిపారేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘జల్ జంగల్ జమీన్’ పోరాటంలో ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

తెలంగాణలో భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ప్రభుత్వ వైఖరి దారుణం అని పేర్కొన్నారు రాహుల్‌ గాంధీ. అర్హులైన ఆదివాసీలకు పోడు భూమి సాగు పట్టాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఆ తర్వాత వెనక్కి తగ్గిందని, ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనని రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ గళాన్ని అణచివేసేందుకు పోలీసు బలగాలను వినియోగించడం అమానుషమని, ఇది తెలంగాణ ఆకాంక్షలకు అవమానమన్న రాహుల్‌ గాంధీ.. కోట్లాది ప్రజల మనోభావాలను సాకారం చేయడానికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కూడా అందులో ప్రముఖ భాగమన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version