తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గేటు, పెద్దచింతకుంట గేటు మీదుగా లాల్కోట చౌరస్తాకు చేరుకుంది. నారాయణపేట జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లాలోప్రవేశించిన రాహుల్ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు లాల్కోట వద్ద ఘనస్వాగతం పలికాయి.
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని టీపీఆర్టీయూ నేతలు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. భోజన విరామంలో చేనేత, పోడు రైతుల ప్రతినిధులతో సమావేశమై.. తమ సమస్యలు వివరించారు. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంటున్నారని గిరిజనులు రాహుల్కు మొరపెట్టుకున్నారు. పోడు రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.
మన్యంకొండలో జరిగిన కూడలి సమావేశంలో ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ పాలనాతీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ హింసను ప్రేరేపిస్తుంటే వాటికి టీఆర్ఎస్ సహకరిస్తోందని విమర్శించారు. నిరుద్యోగం సమస్య పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులను జీఎస్టీ సంక్షోభంలోకి నెట్టిందన్నారు.